మునుగోడు ఉప ఎన్నికల్లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారంలో ఊపును పెంచాయి. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఓ వైపు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు ప్రత్యర్ధి పార్టీలపై ఘాటుగా విమర్శలకు దిగుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి చొరవతో మునుగోడు బై ఎలక్షన్స్ పోరు నుంచి 10 మంది ఇండిపెండెంట్లు తప్పుకున్నారు. మునుగోడు ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని, టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు పలికారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో చండూరులోని పలు వార్డులకు మంత్రి ఎర్రబెల్లి ఇన్ చార్జిగా పని చేస్తూ.. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసిన 10 మంది ఇండిపెండెంట్లు ఉమ్మడి వరంగల్‌కు చెందిన వారని విషయం తెలుసుకున్న మంత్రి రంగంలోకి దిగారు. ఆయా అభ్యర్థులను పిలిపించుకొని మాట్లాడారు. వారి సమస్యలు సావధానంగా విని అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పార్టీపరంగా మంత్రి కేటీఆర్‌ను కలిపించి తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా చూస్తానని తెలియజేశారు. దీంతో వారు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మునుగోడులో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం కోసం పని చేస్తామని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. ఏనాటికైనా టీఆర్‌ఎస్ మాత్రమే రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతుందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్ డంపడుతూ స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికలను తెచ్చాయని దూయబట్టారు.అలాగే ఉప ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటానని ప్రకటించిన ఇండిపెండెంట్ యువకులకు ధన్యవాదాలు తెలిపారు.