అప్పుల బాధ భరించలేక ఓ కౌలు రైతు మృతి చెందాడు. యజమాని మాటి మాటికీ కౌలు రైతును వేధించడం వలన ఆ బాధను భరించలేక చివరకు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా పీచుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చిగురుమామిడి మండలం పీచుపల్లి గ్రామంలో సోమవారం రోజు పోతరవేని రాజయ్య యాదవ్ అనే కౌలు రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే రాజయ్య మృతికి అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు జగ్గారెడ్డి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
రాజయ్య మృతదేహంతో జగ్గారెడ్డి ఇంటి కుటుంబ సభ్యులు రెండో రోజు ధర్నా కొనసాగిస్తున్నారు. రాజయ్య తీసుకున్న అప్పు విషయంలో జగ్గారెడ్డి హింసిచే వాడని, దీంతో రాజయ్య రోజూ మానసికంగా కృంగిపోయేవాడని కుటుంబ సభ్యులు వాపోయారు. జగ్గారెడ్డి కారణంగానే రాజయ్య అనారోగ్యం బారిన పడి చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అప్పు విషయమై చివరకు పోలీస్ స్టేషకు కూడా పిలిపించి ఇబ్బందులకు గురి చేశాడన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని జగ్గారెడ్డి ఇంటి ముందే ఉంచితామని స్పష్టం చేశారు. పోలీసులు, స్థానికులు చెప్పినా వినకుండా కుటుంబ సభ్యులు మృతదేహంతో జగ్గారెడ్డి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.