ఏపీలో సినిమా టికెట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పెద్ద సినిమాల టికెట్ల ధరలను పెంచిన ఏపీ ప్రభుత్వం.. త్వరలోనే ఆన్ లైన్ లో టిక్కెట్లను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటోంది.
దీనికోసం వెబ్ సైట్ నిర్వహణ టెండర్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్టు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఈ బిడ్డింగ్ లో రెండు సంస్థలు పాల్గొనగా.. జస్ట్ టిక్కెట్స్ సంస్థకు టెండర్ దక్కినట్లు తెలుస్తోంది.
అయితే.. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అంటే ఇకపై ప్రేక్షకులు సినిమా చూడాలంటే ఎఫ్‌డీసీ పోర్టల్ ద్వారానే టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆన్ లైన్ టిక్కెట్ల వెబ్ సైట్ వచ్చే నెల రెండో వారం, మూడో వారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఏపీలోని అన్ని థియేటర్ల నుంచి టిక్కెట్లను ఒకే సంస్థ ద్వారా విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు. ప్రైవేట్ సంస్థల కంటే ఆన్ లైన్ లో తక్కువ రేటుకే ప్రభుత్వం టిక్కెట్లను విక్రయించనుందని చెప్తున్నారు. ఈ చర్యతో బ్లాక్ టిక్కెట్ల దందాకు చెక్ పడుతుందని భావిస్తున్నారు.