ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రతులను చించి గవర్నర్ పైకి విసిరేశారు. ఈ ఘటనపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. అదే విషయమై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించి మాట్లాడారు.
గవర్నర్ పై దాడి చేయడం అంటే ఒక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టేనని విమర్శించారు శ్రీకాంత్ రెడ్డి. ప్రజాస్వామ్యంపై టీడీపీకి ఏమాత్రం గౌరవం లేదని ఈ ఘటనతో రుజువైందని అన్నారు. కనీసం ఆయన వయసుకు కూడా గైరవం ఇవ్వకుండా వ్యవహరించడం కరెక్ట్ కాదన్నారు.
అసలు బడ్జెట్ పత్రాల్లో ఏముందో కూడా వారు చూడకుండానే చించేశారని వ్యాఖ్యానించారు. నిండు సభలో గవర్నర్ ను అగౌరవపరిచి.. టీడీపీ నేతలు సంస్కార హీనులుగా వ్యవహరించారని ఆరోపించారు. టీడీపీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఈ ఘటనతో రుజువైందని వ్యాఖ్యానించారు.
గతంలో విపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ ఎంతో హుందాగా వ్యవహరించారని అన్నారు. కానీ.. ప్రస్తుతం టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. బీఏసీ సమావేశంలో సైతం అచ్చెన్నాయుడు తీరు మారలేదని.. సభను, వ్యవస్థలను గౌరవించడం టీడీపీ నేతలు అలవర్చుకోవాలని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.