అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో గత వారం రోజులుగా అమరావతి రైతులు మహా పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం నాయకులు, రైతుల వామపక్ష నేతలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. వందలాదిగా తరలి వచ్చిన వీర మహిళలు, రైతులు, అభిమానులు అమరావతి రైతులకు అండగా బ్రహ్మరథం పడుతున్నారు.
తాజాగా అమరావతి రైతుల మహా పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అయితం పూడి చేరుకుంది. దీంతో ముందుగానే అయితం పూడి గ్రామంలో నిరసన చేసేందుకు వైసీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఒకే రాజధాని కావాలంటూ టీడీపీ నేతలు, మూడు రాజధానులు కావాలంటూ వైసీపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ నేతలు.. వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగడంతో పాదయాత్ర ప్రాంతంలో టెన్షన్ ఏర్పడింది.
ఇదిలా ఉంటే అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఇరగవరం మండలంలో వైసీపీ పార్టీ భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. రైతుల ముసుగులో ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అంటూ తణుకు నియోజకవర్గం వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహిళలు కూడా నల్ల కండువాలు ధరించి, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. అలాగే ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు కాళ్లు మొక్కి మరీ మూడు రాజధానులు కావాలని నిరసన వ్యక్తం చేశాడు ఓ వైసీపీ కార్యకర్త.