నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం దోపిడి, హత్య కేసులో అనుమానితులను, కానిస్టేబుల్‌పై దాడి కేసులో అనుమానితులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక సిక్కు బస్తీవాసులు అక్కడికి భారీగా చేరుకుని నానా హంగామా సృష్టించారు.
మమ్మల్ని విచారణకు పిలుస్తారా అంటూ ఏకంగా సీఐపై దాడికి యత్నించారు నిందితుడు కరణ్‌సింగ్ బంధువులు. దీంతో స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. కాగా.. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఔటర్ సర్వీస్ రోడ్ మైసమ్మ దేవాలయం సమీపంలో బైక్‌పై వెళ్తున్న వారిపై కొందరు దుండగులు తల్వార్లతో దాడికి దిగారు.
ఈ ఘటనలో గంధంగూడకు చెందిన కిశోర్ కుమార్ రెడ్డి మరణించగా.. తులసి అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం వారి వద్ద నుంచి రూ.15 వేల నగదును తీసుకుని దొంగలు పారిపోయారు. అటు దుండగుల బారి నుంచి తప్పించుకున్న తులసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం రాజు, విజయ్ అనే కానిస్టేబుళ్లను జగద్గరిగుట్టలోని సిక్కుల బస్తీకి పంపారు.
ఈ క్రమంలో కానిస్టేబుళ్లపై సర్దార్ కరణ్ సింగ్ తల్వార్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డా రాజు పరిస్ధితి విషమంగా వుండగా.. మరో కానిస్టేబుల్ విజయ్ తలపై గాయాలయ్యాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాల సాయంతో నిందితులను అరెస్ట్ చేశారు.