జిల్లాలో బీజేపీ నేతలు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేశారని.. వాటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గురువారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ సమాచారం కాస్తా పోలీసులకు చేరింది.
దీంతో పార్టీ సీనియర్ నేత గోదావరి కృష్ణా జలాల కన్వీనర్ రావుల రామ్ నాథ్, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అయ్యన్న గారి భూమయ్య సాధం అరవింద్ తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సమాచారం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు తరలివచ్చి కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు.
ఈ క్రమంలో ముందస్తుగానే పోలీసులు కలెక్టరేట్ కార్యాలయానికి గేట్లు వేశారు. అయినా కొందరు కార్యకర్తలు గేట్లు ఎక్కి లోపలికి చొరబడ్డారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అయితే బీజేపీ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై పార్టీ సీనియర్ నేత రావుల రామ్ నాథ్ తీవ్రంగా ఖండించారు. అమాయక నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేసిన వారిని అరెస్ట్ చేయకుండా.. తమను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు రావుల రామ్ నాథ్.