– పరిపాలనా భవన్ ను ముట్టడించిన ఎన్ఎస్ యూఐ
– వీసీకి పింక్ చీర, జాకెట్, గాజులు, మల్లెపూలు!
– అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
– కిటికీ అద్దాలు ధ్వంసం
– వెంకట్ సహా 18 మందికి రిమాండ్
రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఓయూలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులు మాత్రం పర్మిషన్ ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. కానీ.. కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థి సంఘాల నేతలు మాత్రం తీసుకొస్తామని చెబుతున్నారు. పర్మిషన్ ఇస్తారా? లేదా? అంటూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఓయూ పరిపాలనా భవనాన్ని ముట్టడించారు ఎన్ఎస్ యూఐ నేతలు.
రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరించడంతో బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఓయూ వీసీ రవీందర్ కు అందజేసేందుకు పింక్ కలర్ చీర, జాకెట్, గాజులు, మల్లె పూలను తీసుకుని పరిపాలనా భవనంలోకి వెళ్లారు.
అయితే.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే కిటికీ అద్దం పగులగొట్టారు విద్యార్థులు. పరిస్థితి చేయిదాటిపోకుండా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఓయూ పీఎస్ కు తరలించారు. వెంకట్ సహా 18 మందిని రిమాండ్ కు తరలించారు. ఇటు కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థి నాయకులు మినిస్టర్ క్వార్టర్స్ ను కూడా ముట్టడించారు.
Advertisements
7న ఓయూలో రాహుల్ గాంధీ సమావేశానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్ ఓయూ టూర్ కు అనుమతి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని.. ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. దీనికోసం టీపీసీసీ కార్యాచరణను సిద్ధం చేసింది.