ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం పై మంగళవారం ఏబీవీపీ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పేపర్ లీక్ పై సీబీఐతో విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా.. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో పలువురు ఏబీవీపీ నేతలు సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
ఇక ఏబీవీపీ కార్యకర్తల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఎస్ పీఏసీ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ , కార్యదర్శులను వెంటనే బర్త్ రఫ్ చేయాలని, సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.