సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి మృతికి పోలీసులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అక్కడకు వచ్చిన డీఎస్పీ రవీంద్రా రెడ్డితో వాగ్వాదానికి దిగారు. చిన్నా అలియాస్ శ్రీనివాస్ మృతికికి పోలీసులు, వైద్యులే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శవం కుళ్లిపోయేంత వరకు ఆస్పత్రి సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం మృతుడు శ్రీనివాస్ భార్య సంగీత మాట్లాడుతూ.. నా భర్తని పోలీసులే చంపేశారని ఆరోపించారు. యాక్సిడెంట్ కాలేదని నాకు అనుమానంగా ఉందన్నారు.
సుల్తాన్ పూర్ లో మాకు బంధువులు లేరని అటు ఆయన ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. యాక్సిడెంట్ అయినప్పుడు, చనిపోయినప్పుడు మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అని నిలదీశారు. మాపై పోలీసులు లాటీ ఛార్జ్ చేశారని.. కడుపుతో ఉన్న మహిళను తన్నారని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నిరసనగా రోడ్డుపై బైఠాయించారు చిన్నా కుటుంబ సభ్యులు. న్యాయం చేయాలని కోరారు. దీంతో సంగారెడ్డి రహదారి స్తంభించిపోయింది.
అసలేం జరిగిందంటే.. గత నెల 18వ తేదీన శ్రీనివాస్(28) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు ఆస్పత్రి సిబ్బంది. గత నెల 18 నుంచి 22 వరకు సంగారెడ్డి ఆస్పత్రిలో చికిత్స అందించారు వైద్యులు. అనంతరం డిసెంబర్ 23న చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు.
అతను చనిపోయిన వెంటనే సంగారెడ్డి టౌన్, పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చామంటున్నారు ఆస్పత్రి వైద్యులు. అప్పటి నుంచి ఇప్పటివరకు శ్రీనివాస్ డెడ్ బాడీ ఆస్పత్రిలోనే ఉంది. ప్రతీ రోజు సమాచారం ఇచ్చినా పోలీసులు రెస్పాండ్ కాలేదని వైద్యులు చెబుతున్నారు. తాజాగా మరోసారి సమాచారం అందించగా.. పోలీసులు మార్చురీకి చేరుకున్నారు. శవాన్ని బయటకు తీస్తుండగా.. ఆధార్ కార్డ్ బయటపడింది.
ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో బంధువులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని, ఇప్పటివరకు పోలీసులు కనీసం సమాచారం ఇవ్వలేదని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ డెడ్ బాడీ తీసుకెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయారు బంధువులు.