శ్రీచైతన్య కాలేజ్ ఇంటర్ స్టూడెంట్ సాత్విక్ మృతి పై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్పొరేట్ కాలేజ్ సిబ్బంది కృష్ణా రెడ్డి,ఆచార్య, హాస్టల్ వార్డెన్ నరేష్ పేర్లను ఎఫ్ ఐ ఆర్ లో చేర్చారు.
సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశారు. అయితే నార్సింగ్ శ్రీచైతన్యలో ఇంటర్ చదువుతున్న సాత్విక్ క్లాస్ రూంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒత్తిడి వల్లే అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని తోటి విద్యార్థులు ఆరోపించారు.
సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి స్టడీ అవర్ పూర్తి అయిన తర్వాత మిగిలిన విద్యార్థులు బయటకు రాగా.. అతడు క్లాస్ రూంలోనే ఉండిపోయాడు. కొద్ది సేపటికి అక్కడే ఉన్న ఓ నైలాన్ తాడుతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత సేపటికి అతడు రాకపోవడంతో తోటీ విద్యార్థులు క్లాస్ రూం కు వచ్చి చూడగా.. అప్పటికే సాత్విక్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.
వెంటనే హాస్టల్ వార్డెన్ కు సమాచారం ఇచ్చినప్పటికీ అతడు నిర్లక్ష్యంగా వ్యహరించాడు.సాత్విక్ ను ఆసుపత్రికి తరలించకపోగా క్లాస్ రూంకు లాక్ చేసుకొని వెళ్లిపోయినట్లు విద్యార్థులు తెలిపారు. వెంటనే వార్డెన్ స్పందించి ఉంటే సాత్విక్ బతికేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. పావు గంట గడిచినప్పటికీ వార్డెన్ డోర్ తెరవకపోవడంతో విద్యార్థులు కేకలు వేశారు.
దీంతో డోర్ ఓపెన్ చేయగా అప్పటికి కూడా సాత్విక్ కొన ఊపిరితో ఉన్నాడు. చివరకు వార్డెన్ సహకరించకపోవడంతో విద్యార్థులే సాత్విక్ ను ఓ బైకర్ సహాయంతో ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
మరో వైపు నార్సింగిలోని కార్పొరేట్ కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాత్విక్ తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ సిబ్బంది తీరుపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వీరి ధర్నాకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలపడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరో వైపు కాలేజీ హాస్టల్ వార్డెన్ పరారీలో ఉన్నాడు.