అమరావతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుళ్లూరులో 48 గంటల దీక్షకు జై భీమ్ పార్టీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీక్షకు వచ్చిన శ్రావణ్ కుమార్ ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శ్రావణ్ నివాసం, ఆఫీసును పోలీసులు చుట్టుముట్టారు.
అక్కడకు ఎవరినీ అనుమతించడం లేదు. రోడ్డుపైకి వచ్చినవాళ్లను పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అలాగే జై భీమ్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలను అంబేద్కర్ విగ్రహం వద్ద అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం శ్రావణ్ కుమార్ దీక్షకు మద్దతుగా రాజధాని రైతులు తరలివచ్చారు.
దీక్షలు చేయడానికి పర్మిషన్ లేదని, తుళ్లూరు మెయిన్ బజారులో ఎవరూ ఉండొద్దని, వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఊళ్ళో ఎవరూ తిరగొద్దు అంటూ ముందుగా అనౌన్స్ మెంట్ చేయాలని.. అప్పుడు ఎవరూ ఉండరని రైతులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
రోడ్డుపైన, ఇంటి ముందు కూర్చున్న గ్రామస్తులను లోపలకు వెళ్లిపోవాలని సూచించారు పోలీసులు. గ్రామస్తులు మాత్రం అందుకు ససేమిరా అంటూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల ఆదేశాలపై మహిళా రైతులు మండిపడుతున్నారు. తాము ఏం చేశామని 144 సెక్షన్ పెడుతున్నారని ప్రశ్నించారు.
తాము రాజధాని కోసం భూములు ఇచ్చిన పాపానికి.. అమరావతిలో పాకిస్తాన్ బోర్డర్ కంటే అన్యాయంగా ఉందని, రాజధాని ప్రాంతంలో అంతా అరాచకంగా ఉందని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రైవేట్ స్థలంలో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఖాళీ చేయాలని పోలీసులు చెప్పడం ఏంటని నిలదీశారు మహిళా రైతులు.