సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తోపులాటలో 20 మంది క్రికెట్ అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. ఉప్పల్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ కోసం.. జింఖానా గ్రౌండ్స్ లో టికెట్లు ఇస్తోంది హెచ్ సీఏ. ఈ నెల 25న జరిగే ఇండియా వర్సస్ ఆస్ట్రేలియా టీ20కి మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది.
కాగా ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కానిస్టేబుల్ శ్రీకాంత్, ఫైర్ సిబ్బంది ఒకరు, నలుగురు మహిళలు, ఒకరు సివిలియన్.. మొత్తం ఏడు మంది యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు నార్త్ జోన్ అదనపు డీసీపీ తెలిపారు. అయితే జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన మహిళ చనిపోయినట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారు అడిషనల్ కమిషనర్ చౌహన్. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతున్నట్లు ఆయన తెలిపారు.
దాదాపు మూడు సంవత్సరాల విరామం తరువాత హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టీ 20 కి అతిధ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 25న జరిగే ఈ మ్యాచ్ టికెట్ల కోసం జనాలు పోటెత్తారు. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకం ఈ రోజు చేపట్టనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
దీంతో సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ కి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మకాలు కొనసాగుతాయని హెచ్‌సీఏ పేర్కొంది. దీంతో రాత్రి నుంచే జనాలు క్యూ కట్టడం మొదలు పెట్టారు. అయితే మొదట ఈ టికెట్ల అమ్మకం పై గందరగోళ వాతావరణం నెలకొంది. మొదట పేటీఎం వేదికగా టికెట్లు అమ్మినట్లు హెచ్‌సీఏ పేర్కొంది. ఆన్‌లైన్ లో టిక్కెట్లు బుక్ అవ్వడం లేదంటూ చాలా మంది ఫిర్యాదు చేశారు. 39 వేల టికెట్లు ఏమయ్యాయంటూ నిన్న అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ తరుణంలోనే జింఖానా మైదానంలో టికెట్ల అమ్మకం అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఉదయం 7 గంటలకే వేలాది సంఖ్యలో జనాలు చేరుకున్నారు. కానీ గేట్లు మూసి వేసి ఉండటం, అధికారులెవరూ లేకపోవడంతో ఫ్యాన్స్ గేట్లు దూకి లోపలికి ప్రవేశించారు. కొందరు లోపలికి దూసుకెళ్లి హెచ్ సీఏ డౌన్ డౌన్ అంటూ నినాదాలు తీశారు. దాంతో అధికారులు దిగి వచ్చి ఈరోజు టికెట్లు అమ్ముతామని హామీ ఇచ్చారు. ఇలా టికెట్ల విషయంలో గందరగోళ నెలకొనడంతో తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు.