హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుండగులు గోవులను అక్రమంగా బులెరో వాహనంలో తరలిస్తున్నారని తెలుసుకున్న గోరక్షక్ సభ్యులు ఆ వాహనాన్ని కర్మన్ ఘాట్ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన దుండగులు ఇన్నోవో వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు. కత్తులతో దాడులకు దిగారు.
దీంతో గోరక్షక్ సభ్యులు దగ్గరలో ఉన్న ఆంజనేయ దేవాలయంలోకి పరుగులు తీశారు. ఆలయంలోకి ప్రవేశించి కత్తులతో దాడులు చేశారని ఆరోపిస్తున్నారు గోరక్షక్ సభ్యులు. విషయం తెలుసుకున్న హిందూసంఘాలు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కర్మన్ ఘాట్ కు చేరుకొని రోడ్డుపై భైటాయించారు.
దుండగులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
పోలీసుల లాఠీఛార్జ్ లో భజరంగ్ దళ్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులపై రాళ్లదాడి చేశారు. రాళ్ల దాడిలో పోలీసుల వాహనాల అద్దాలు ధ్వంసం కాగా.. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.