ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గొల్లపూడిలోని వివాదాస్పద స్థలంలో టీడీపీ పార్టీ కార్యాలయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో.. అక్కడి నుంచి టీడీపీ కార్యాలయం తరలింపు పనులు ప్రారంభించారు పోలీసులు. కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు. కార్యాలయంలోని కంప్యూటర్లను కూడా తరలించారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
మరో వైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా..టీడీపీ కార్యాలయంతో పాటు గొల్లపూడిలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలను కట్టడి చేస్తున్నారు. మాజీ మంత్రి,పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావును హౌస్ అరెస్ట్ చేశారు. ఇక మొన్న రాత్రి నుంచి టీడీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
అయితే ఈ నెల 28వ తేదీలోగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని టీడీపీ నేత ఆలూరి చిన్నాకు స్థానిక తహసీల్దారు నోటీసులు ఇచ్చారు. ఇంకా గడువు పూర్తి కాకముందే.. పోలీసులు చర్యలు చేపడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యాలయానికి బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్ అని బోర్డు ఏర్పాటు చేశారు. వివాదాస్పద స్థలాన్ని.. స్థల యజమానికి అప్పగించామని చెబుతున్నారు పోలీసులు.
ఇక స్థల యజమాని మాట్లాడుతూ..పార్టీ కార్యాలయానికి స్థలం రాసిచ్చేంత ఆస్తులు మాకు లేవని.. దేవినేని ఉమ లాగా మేం ఆస్తులు సంపాదించుకోలేదని మండిపడ్డారు. తల్లికొడుకుల మధ్య ఉమ వచ్చి తగాదాలు పెడుతున్నారని ఆరోపించారు. నా ఇంటి ముందు ఉమ ధర్నా చేయడమేంటీ.. ఉమ ఇంటి ముందు నేను ధర్నా చేస్తే ఊరుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.