హన్మకొండ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంలోని గుడ్ల సింగారం ప్రాంతంలోని 177 సర్వే నెంబర్ లో 3000మంది నిరుపేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. అయితే.. ఆ భూమి మాది అంటూ.. అక్రమంగా మా భూమిని ఆక్రమించుకున్నారంటూ పట్టాదారులు అడ్డుకున్నారు.
దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కర్రలు రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. భారీగా మోహరించిన పోలీసులు..ఘర్షణను అదుపులోకి తీసుకొచ్చారు. సీపీఐ, సీపీఎం నాయకులు ఎంట్రీ ఇవ్వడంతో ఈ గొడవ మరింత ఉధృతంగా మారిందని పోలీసులు చెప్తున్నారు. గుడిసెల పేరుతో ఆందోళనను మరింత రెచ్చగొట్టారని ఆరోపిస్తున్నారు.
గతంలో ఎన్‌టీఆర్ ప్రభుత్వం హయాంలో సాగు కింద 13 ఎకరాల భూమిని 56 మంది లబ్దిదారులకు అధికారులు కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమిని వాపసు తీసుకొని మహిళా సంఘాలకు అప్పగించారు. వాటర్ సమస్య ఎక్కువగా ఉండటంతో మహిళా సంఘాలు ఆ ప్రాంతాన్ని ఒదులుకున్నాయి.
దీంతో ఆ ప్రాంతం అంతా ఖాలీగా ఉంది. ఈ క్రమంలో నిలువనీడ లేని నిరుపేదలు ఆ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే.. గత ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టా చేయించుకున్న పట్టాదారులు ఆ భూమి తమదేనని ఘర్షణకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.