మరో సారి ఉస్మానియా క్యాంపస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరుద్యోగ మార్చ్ కు జేఏసీ పిలుపు ఇవ్వడంతో భారీగా యువత, విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకున్నారు. దీంతో మరో పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమవ్వగా.. అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జేసీఏ నాయకులను అదుపులో తీసుకుంటున్నారు. దీంతో పాటు రెండ్రోజుల పాటు క్యాంపస్ లో హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ రోజు ఓయూలో ఉదయం నిరుద్యోగ మార్చ్ నిర్వహించి, మధ్యాహ్నం నిరసన దీక్ష చేపట్టాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. కాని ఈ సందర్భంగా ఓయూలో విద్యార్థి నాయకులను వసతి గృహల్లోనే పోలీసులు నిర్భందిస్తున్నారు. మరో వైపు క్యాంపస్ లోకి వస్తున్న విద్యార్థుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది.
అయితే పేపర్ లీకేజీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈరోజు, రేపు ఆర్ట్స్ కాలేజీ ముందు మహా దీక్షకు పూనుకున్నారు. కాని అందుకు యూనివర్సిటీ అధికారులు అనుమతించలేదు. ఒక వేళ దీక్ష చేస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. అయితే విద్యార్థి సంఘాలు వెనక్కి తగ్గకపోవడంతో ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. క్యాంపస్ కి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేశారు. ఎవరిని లోనికి అనుమతించడం లేదు.
మరో వైపు ఈ అరెస్టులపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇలా ఉంటే.. క్యాంపస్ లోకి ప్రతిపక్ష నాయకులు వస్తే అడ్డుకుంటామని అధికార పార్టీ విద్యార్థి సంఘాలంటున్నాయి. ప్రతిపక్ష నాయకుల రాకను విప్లవ వామపక్ష విద్యార్థి సంఘాలు స్వాగతిస్తున్నాయి. దీంతో క్యాంపస్ లో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.