అర్థరాత్రి గాంధీ భవన్ పరసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. మెయిన్స్ లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు మంగళవారం గాంధీ భవన్ లో ఆందోళనకు దిగారు. తర్వాత ప్రగతిభవన్, డీజీపీ కార్యాలయం, పోలీసు నియామక బోర్డు కార్యాలయాల ముట్టడికి బయలుదేరగా.. బారికేడ్లను అడ్డుపెట్టి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఎన్‌ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ కు మధ్య వాగ్వివాదం జరిగింది.
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గాంధీ భవన్ లో నిరసన కొనసాగించారు అభ్యర్థులు. పోలీసులు ఈ ఆందోళనను భగ్నం చేశారు. వెంకట్, కార్పొరేటర్ విజయా రెడ్డిలను కూడా అరెస్ట్ చేశారు. దీంతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.
పరుగు పందెంలో క్వాలిఫై అయిన అభ్యర్థులను.. ఎగ్జామ్ రాసేందుకు అనుమతించాలని ఆందోళనకు చేశారు అభ్యర్థులు. లాంగ్ జంప్, షాట్ పుట్ గతం కంటే ఎక్కువ పెంచడం వల్ల తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్ ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్న ఖాకీలు.. తాళాలు కూడా వేశారు.
పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. పరీక్షలను కావాలని కఠినంగా ఏర్పాటు చేసి.. ఎంతోమంది నిరుద్యోగులకు అన్యాయం చేశారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు. దీనికి సంబంధించి గవర్నర్ అపాయింట్ మెంట్ కూడా కోరారు కాంగ్రెస్ నేతలు.