వరంగల్ కార్పొరేషన్ లో ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. గ్రీవెన్స్ సెల్ లో కమిషనర్ ప్రావీణ్యతో రైతులు వాగ్వివాదానికి దిగారు. దీంతో జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ ఉద్రిక్తంగా మారింది.
రైతుల ప్రమేయం లేకుండా సర్వే నెంబర్లతో పత్రిక ప్రకటన ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తూ.. రైతులు వరంగల్ కలెక్టర్ ను ముట్టడించారు. ప్రభుత్వం తమ వ్యవసాయ భూములు లాక్కోని రియల్ ఎస్టేట్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
రైతుల కష్టాన్ని సోమ్ముచేసుకోవడం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. తమ వ్యవసాయ భూముల జోలికి వస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. ల్యాండ్ పూలింగ్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.
కూడా(KUDA) చేపట్టిన ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని నినదించారు రైతులు. ప్రభుత్వం వద్ద ఖజానా లేకపోతే రైతులందరం బిక్షం ఎత్తుకొని పైసలు ఇస్తాం.. అంతేకానీ రైతులను మాత్రం ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఐక్య కార్యాచరణ సమితి జిల్లా కన్వీనర్ బుద్దె పెద్దన్న.