నిమ్స్ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీతి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబసభ్యులు సంతకం చేస్తేనే బాడీని షిఫ్ట్ చేయడానికి వీలు ఉంటుంది. దీంతో ప్రీతి కుటుంబసభ్యులను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు.
ఇటు నిమ్స్ వద్దకు గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు చేరుకున్నారు. ఆందోళన కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, డాక్టర్ల అసోసియేషన్ సభ్యులు కూడా ఆస్పత్రి దగ్గరకు వెళ్లారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. అలాగే, కేఎంసీ హెచ్ఓడీని నిందితుడిగా చేర్చాలన్నారు.
సైకో సైఫ్ వేధింపులతో ఆస్పత్రి పాలయిన ప్రీతి సరిగ్గా రాత్రి 9.10 గంటలకు కన్నుమూసింది. ఈ మేరకు నిమ్స్ డాక్టర్లు ప్రకటన చేశారు. బ్రెయిన్ డెడ్ తో మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ప్రీతి మరణాన్ని ముందుగానే అంచనా వేశారు తల్లిదండ్రులు. డాక్టర్లు వారికి ముందుగానే కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రీతి బతికే అవకాశం లేదని.. బ్రెయిన్ డెడ్ అయినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె తండ్రి నరేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతీది ముమ్మాటికీ హత్యేనని అన్నారు.
ర్యాగింగ్ ఇష్యూను హెచ్ఓడీ సరిగ్గా హ్యాండిల్ చేయలేదన్న ఆయన.. ప్రీతి జోలికి సైఫ్ రాకుండా ఆపలేకపోయారని ఆరోపించారు. సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.