నిన్న అయ్యప్ప స్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరీ నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరచగా అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నరేష్ ను పోలీసులు పరిగి సబ్ జైలుకు తరలించే క్రమంలో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున దారి కాసి… నరేష్ ను వెంటనే తమకు అప్పగించాలని జైలు ముందు నినాదాలు చేశారు.
అయితే పోలీసు వాహనంలో నుంచి నరేష్ దిగి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి పోయాడు. దీంతో అతనిపై దాడి చేసేందుకు అయ్యప్ప భక్తులు యత్నించారు. సబ్ జైలుకు పెద్ద సంఖ్యలో చేరుకున్న అయ్యప్ప భక్తులు గేటును తోసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని బయటకు నెట్టి గేటుకు తాళం వేశారు. నాస్తిక సంఘం నాయకుడు బైరి నరేష్ ను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ట్రేస్ చేసి ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా వికారాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి దీన్ని స్పష్టం చేశారు.
నరేష్ పై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు అయ్యప్ప భక్తులు. 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని వికారాబాద్ ఎస్పీ హెచ్చరించారు. అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తుండగా.. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.
నరేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అయ్యప్ప స్వాములు ఆందోళన విరమించాలని ఎస్పీ కోరారు. అయితే.. కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప మాల ధరించిన భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన అతడిపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.