కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ రోజూ ఎక్కడో ఒకచోట ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా దళిత బంధుపై దళిత సంఘాలు యుద్ధానికి దిగాయి.
దళిత బంధును గ్రామాల్లో కొందరికి మాత్రమే ఇస్తున్నారని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత సంఘాల నాయకులు. కొడంగల్ నియోజకవర్గంలో ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ.. దీనిపై గతంలో చాలాసార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని ఆయన పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో దళిత సంఘాల నాయకులు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యను పరిష్కరించకుంటే ఎక్కడకు వెళ్లినా వదలేది లేదని.. వెంటపడి అడ్డుకుంటామని హెచ్చరించారు.
టీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే దళిత బంధు వస్తుందనే భావనను రాష్ట్రంలో కల్పించారని అంటున్నారు దళిత సంఘాల నాయకులు. ఎమ్మెల్యే, ఎంపీలకు అనుకూలంగా ఉన్న వారికి, సీనియర్ టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే దళిత బంధు ఇచ్చేందుకు ప్రయత్నాలు నడుస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా పట్నం నరేందర్ రెడ్డి తీరు మార్చుకుని అర్హులైన దళితులందరికీ పథకాన్ని అమలు చేయాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు.