- హింసాత్మక ఘటనలతో అస్థిరత
- టీఆర్ఎస్ సర్కారు అసమర్థతపై ప్రజాగ్రహం..
ఉద్యమాలకు నిలయమైన తెలంగాణ గత కొన్ని రోజులుగా నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఇవి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. గత మూడు నెలలుగా తెలంగాణలో వరుస ఉద్యమాలతో అగ్గి రాజుకుంది. ఒకవైపు కాంగ్రెస్.. మరోవైపు.. బీజేపీ.. ఇంకో వైపు నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా.. రాష్ట్రంలో చాలాచోట్ల ఆందోళనలు, నిరసనలపర్వమే. కారణాలు ఏవైనా.. రాష్ట్రం ఇప్పుడు.. ఆందోళనలకు కేంద్రంగా మారిపోయింది. మరోవైపు హైదరాబాద్ లో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం అపప్రథను మూటగట్టుకుంటోంది. అటు సోషల్‌మీడియాలోనూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నెటిజన్లు పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేశారు. రక్షణ వ్యవస్థ మొద్దునిద్రలో జోగుతున్నట్లు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మొన్న గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు పరిహారం కోసం రోడ్డెక్కారు. దీంతో నిర్వాసితులపై లాఠీచార్జ్ కు దారితీసింది. బాధితులపై అమానుషంగా ప్రవర్తించడంతో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజల విమర్శలకు దారితీసింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీచేసి ప్రశ్నించినందుకు నిరసనగా కాంగ్రెస్ ఇచ్చిన రాజ్‌భవన్ ముట్టడి పిలుపు విషయంలో ఇంటెలిజెన్స్, పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఎందుకు అందిచలేదనేది పలు అనుమానాలకు తావిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా సాగుతున్న నిరసన కావడంతో ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా వ్యవహరించారా అనే చర్చ బీజేపీ శ్రేణుల్లో జరుగుతోంది. తాజాగా ‘అగ్నిపథ్’ నిర్ణయానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరసన హింసకు దారితీయడంతో రాష్ట్ర ప్రభుత్వం చేతనావస్థలో ఉందనే విషయం బహిర్గతమైంది. తెలంగాణ ఉద్యమం సమయంలో సైతం రైళ్లను కాల్చలేదని, ఇప్పుడు హఠాత్తుగా విధ్వంసం జరిగితే ప్రజలు.. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు విఫలమైందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒక పథకం ప్రకారమే ఈ విధ్వంసం, హింస జరిగిందని, కొన్ని పార్టీలు దీని వెనక ఉన్నాయంటూ టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపించుకున్నారు.
స్వరాష్ట్రంలో కొన్నేండ్ల పాటు ప్రశాంత వాతావరణమే ఉన్నప్పటికీ.. గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై, ఇటు కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా హింసాత్మక ఘర్షణలు చోటుచోసుకోవడంతో అస్థిరత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఒక్కసారిగా రైలు కోచ్‌లను తగులపెట్టి, నడిరోడ్డుపై బైక్‌లను దగ్ధం చేసే ఘటనలు చోటుచేసుకోవడం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హింసాత్మక ఘటనలు పేట్రేగిపోతుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు పసిగట్టలేకపోయిందనే వాదనలు వినపడుతున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ విషయంలో పట్టనట్లుగా వ్యవహరించడంపై ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే హింసాత్మక సంఘటనల పట్ల చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని బిజెపి విమర్శిస్తోంది.
కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్ ఎదుట బైక్‌ను దగ్ధం చేసి నిరసనను రాష్ట్రవ్యాప్తం అయ్యేలా ప్లాన్ చేసినా దాన్ని ముందుగానే నివారించడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారని, ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, బీజేపీని బదనాం చేయడానికి పరోక్షంగా సహకారం ఇచ్చిందనే విమర్శలను రాష్ట్ర ప్రభుత్వం మూటగట్టుకుంది. అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన హింసాత్మక చర్యల వెనక కుట్ర ఉన్నదనే అనుమానాలు వివిధ సెక్షన్ల ప్రజల నుంచి బలంగానే వినిపిస్తున్నాయి. రైల్వే శాఖ వర్గాలకూ ఈ అనుమానం ఉన్నా దర్యాప్తు తర్వాతనే స్పష్టత వస్తుందంటూ వ్యాఖ్యానిస్తున్నాయి.
మరోవైపు నిర్మల్ జిల్లా బాసర ఐఐటీ విద్యార్థుల సమస్యలు, సౌకర్యాల కొరత, సామగ్రి సరఫరాలో నిర్లక్ష్యంపై విద్యార్థులు గళమెత్తారు. సుమారు ఆరు వేల మంది విద్యార్థులు మంగళవారం ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేవారు. రాష్ట్రంలో ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనల విషయంలో కనీసం స్పందించకపోవడం, అసమర్థ వైఖరిని అవలంభించడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా నలువైపులా ఉద్యమాలు.. నిరసనలు కొనసాగుతున్న క్రమంలో సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలో అలజడులను నిలువరించేలా చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై మేథావులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికైనా మూకుమ్మడి ఆందోళనలు, హింసాత్మక చర్యలను అరికట్టేలా.. ఉద్యమకారులు శాంతించేలా సీఎం కేసీఆర్ ప్రకటన చేయాలని కోరుతున్నారు.