నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. కర్రలు రాళ్లతో కొట్టుకున్నారు. అంతకుముందు.. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ మొండివైఖరిని తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. అందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు.అదే సమయంలో టీఆర్ఎస్ నాయకులు సైతం వడ్ల కొనుగోళ్ల అంశంపై కేంద్రం స్పష్టమైన ప్రకటనను విడుదల చేయాలంటూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిరసన చేపట్టారు.
ఒకే ప్రాంతానికి చెందిన రెండు వర్గాల నాయకులు నిరసనలు చేపట్టడంతో అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురయ్యారు. ఇరువురి మధ్య మాటామాట పెరిగి ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
ఘర్షణ జరుగుతున్నట్టు సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. అయితే.. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఘర్షణలో భీంగల్ ఎస్సైని సైతం కిందకు తోసేసినట్టు తెలుస్తోంది.