– ప్రజలకందని ప్రభుత్వ పథకాలు
– సిరిసిల్లలో రాజుకున్న అగ్గి
– అర్హులందరికీ డబుల్ బెడ్ రూంలు ఇవ్వాలని ఆందోళన
– లబ్ధిదారులను మొడిచేయి
– పార్టీసానుభూతి పరులకు కేటాయింపు
– ఆందోళనకు దిగిన గ్రామస్థులు
– పెట్రోల్ పోసుకున్న గ్రామస్థుడు
– సభను మధ్యలో వదిలేసి వెనుదిరిగిన అధికారులు
– జిల్లా కేంద్రంలోని 10వ వార్డు చిన్నబోనాల పరిధిలో ఉద్రిక్తత
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే పేదల కష్టాలు తీరుతాయని భావించిన రాష్ట్ర ప్రజలకు కన్నీరే మిగింలింది. పేదలకు మూడెకరాల భూమి, దళిత సీఎం, దళిత బంధు, రైతులకు రుణమాఫీ, పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు.. ఇలా ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఇస్తానన్న ఓ ఒక్క హామీ ప్రజలకు అందలేదు. దీంతో.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ల విషయంలో అరచేతిల బెల్లం పెట్టి మోచేతిని నాకిచ్చినంత పనిచేస్తోంది రాష్ట్రప్రభుత్వం.
సొంతిండ్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది. కానీ.. ఇంత వరకు వాటి జాడే లేదు. డబుల్ బెడ్ రూం సంగతి దేవుడెరుడు కానీ.. సచ్చిన కోడిని గుమ్మానికేలాడదీసి పచ్చిముద్దల బువ్వ తిన్న.. పిసినారి దానయ్య కథ గుర్తుకొస్తోందంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు ఈ డబుల్ బెడ్ రూం ఇండ్ల పంచాయితీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిప్పు రాజేసుకుంది. డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం బుధవారం చేపట్టిన వార్డు సభ రసాభాసాగా మారింది. ఇండ్ల పంపకాల్లో అన్యాయం జరిగిందంటూ భానోతు నరేష్ అనే యువకుడు పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించాడు.
జిల్లా కేంద్రంలోని 10వ వార్డు చిన్నబోనాల పరిధిలోని భూపతినగర్, చిన్నబోనాల, ముష్టిపల్లి గ్రామాల్లో అధికారులు సర్వే చేసి 78 మందిని అర్హులుగా గుర్తించారు. మూడు నెలల క్రితం చిన్నబోనాలలో ఏర్పాటు చేసిన వార్డు సభలో అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని గ్రామస్థులు అందోళన చేపట్టారు. కొందరికే ఇండ్లు కేటాయిస్తున్నట్టు అధికారులు ప్రకటించడంతో గ్రామస్థులు దాడులకు యత్నించారు. దీంతో అధికారులు ఆ సభను వాయిదా వేశారు.
తాజాగా.. రెండో సారి లబ్ధిదారుల ఎంపిక కోసం సభ ఏర్పాటు చేశారు. 78 మందిలో వార్డుకు కేటాయించిన 44 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారుల ప్రకటించారు. అయితే.. ఇండ్లు, ఇంటి స్థలాలు, ఆస్తులు ఉన్న వారికి కేటాయించడంతో..అర్హులను కాదని పలుకుబడి ఉన్న వారికి కేటాయించారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అలాంటి వారి పేర్లను తొలగించి.. అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దీంతో సభను సాయంత్రానికి వాయిదా వేశారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్ విజయ్ కుమార్, కౌన్సిలర్ బొల్గం నాగారాజు గౌడ్ తో పాటు అధికారులు.. 78 మందిలో 19 మంది పేర్లను తొలగించామని ప్రకటించారు. వార్డుకు కేటాయించిన 44 డబుల్ బెడ్ రూం ఇళ్లలో 11 మంది ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కింద కేటాయించామని ప్రకటించారు. మిగతా 33 మంది లబ్ధిదారులను డ్రా పద్దతిన ఎంపిక చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు.. ప్రత్యేక అధికారులతో సర్వే జరిపించి ఇల్లు లేని పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సర్వేలో అధికారులు గుర్తించిన వారందరికీ.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని ఆందోళనకు దిగారు. అదే సమయంలో గ్రామానికి చెందిన భానోతు నరేష్ అనే యువకుడు తాను గుడిసెలో జీవిస్తున్నానని.. తనను అనర్హుడిగా గుర్తించడంతో అన్యాయం జరిగిందని పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న అధికారులతోపాటు.. పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. గ్రామస్థులు ఆందోళనను విరమించకపోవడంతో అధికారులు సభను మధ్యలో వదిలేసి అక్కడినుండి వెళ్లిపోయారు.