ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యమాన్ని నడిపినందుకు కార్మిక నేత అశ్వథామరెడ్డిపై సర్కార్ కక్ష కట్టిందా…? ఆయన్ను సర్వీసు నుండి తొలగించి… ఆర్టీసీతో సంబంధం లేకుండా చేయబోతున్నారా…? అశ్వథామరెడ్డి ఉద్యోగం నుండి తీసేసేందుకు రంగం సిద్ధమయ్యిందా…?
ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం వస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమం నడుపుతున్నారంటూ తమ సొంత యూనియన్ నాయకుడిపైనే టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసేందుకే సమ్మె చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇటు ప్రభుత్వం కూడా ఏకంగా ఆర్టీసీ సంఘాలు లేకుండా చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఓవైపు ఉద్యోగులకు హామీలు ఇస్తూనే కార్మిక నేతలను ఉద్యోగుల నుండి దూరం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి.
తాజాగా… ఆర్టీసీ కార్మిక నేత, టీఆర్ఎస్ అనుబంధ యూనియన్ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వథామరెడ్డిని సర్వీసు నుండి తొలగించేందుకు ఆర్టీసీ అధికారులు రెడీ అయ్యారు. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతి లేకుండా ఉద్యోగానికి హాజరుకాకపోటంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఎంజీబీఎస్ లో మీరు విధులకు హాజరు కావాల్సి ఉండగా, 06.12.2019-24.01.2020, 25.01.2021-25.08.2020 మధ్య విధులకు హాజరు కాలేదంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. 7 రోజుల్లో స్వయంగా వచ్చి వివరణ ఇవ్వకుంటే ఉద్యోగం నుండి శాశ్వతంగా తీసేస్తామంటూ నోటీసులో పేర్కొంది.
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే కార్మిక నాయకున్ని పంపించే కుట్ర చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఉద్యోగుల డిమాండ్ల కోసం సమ్మె చేస్తే… ఇలా వ్యక్తిగతంగా పగ తీర్చుకుంటున్నట్లు మండిపడుతున్నారు.