భారత్ లో ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ ఏడాది జరగనున్న గణతంత్ర వేడుకలను ముష్కరులు టార్గెట్ గా పెట్టుకున్నారని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ప్రధాని నరేంద్రమోదీ సహా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని భారీగా దాడులకు తెగబడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. పాకిస్థాన్, అఫ్గాన్-పాక్ ప్రాంతానికి చెందిన ముష్కరులు దాడులకు పాల్పడతారని తమకు సమాచారం ఉందని తెలిపాయి.
గణతంత్ర వేడుకలతో పాటు.. రద్దీగా ఉండే ప్రాంతాలు.. ప్రజా సమూహాలు, ప్రముఖ కట్టడాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు ముష్కరులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దాడులకు ఉగ్రవాదులు డ్రోన్లు, భారీ పేలుడు పదార్థాలు వాడే ప్రమాదం ఉందని కీలక సమాచారం. లష్కరే తోయిబాతో పాటు ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలు పెద్ద ఎత్తున దాడులకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీతో పాటు పంజాబ్, ఇతర నగరాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగే ప్రమాదం ఉంది.
ఉగ్రమూకలు ఇప్పటికే పంజాబ్ సరిహద్దుల వెంబడి దేశంలోకి ఎంటర్ అయినట్టు తెలుస్తోంది. ఇంటెలిజన్సీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అనుమానం కలిగిన ప్రాంతాలలో జల్లెడ పడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.
కాగా, దేశంలో కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో ఈనెల 26న జరిగే గణతంత్ర వేడుకలకు కేవలం 24 వేల మందికి అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కరోనాకు ముందు 2020లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో దాదాపు లక్షా 25 వేల మంది పాల్గొన్నారు. గతేడాది కొవిడ్ నిబంధనల మధ్య 25 వేల మందిని అనుమతించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు కజక్‌స్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాధినేతలను ప్రత్యేక అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది.