ఇండియాకు సమీపంలోనే ‘ఉగ్రవాద కేంద్రం’ ఉందని విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పరోక్షంగా పాకిస్థాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ శాంతికి, సెక్యూరిటీకి కలుగుతున్న ముప్పుపై తామిదివరకే ఎన్నోసార్లు మాట్లాడామని, ఇప్పుడు హింసాత్మక సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రకాల రాడికలైజేషన్, ఫండమెంటలిజంవంటి ధోరణులు ఈ ‘కేంద్రం’ లో ఉన్నాయని ఆయన చెప్పారు.
వియన్నాలో ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్ బెర్గ్ తో కలిసి సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ.. వారి (పాక్) అక్రమ మాదకద్రవ్యాల రవాణా, అక్రమ ఆయుధాల వ్యాపారం, ఇతర అంతర్జాతీయ నేరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నారు. వారి ఇలాంటి ప్రయత్నాలు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదన్నారు. ఇండియాకు ఈ ‘ఎపిసెంటర్’ అతి దగ్గరలో ఉన్న కారణంగా సహజంగానే మా అనుభవాలు, మా దృక్పథాలు ఇతరులకు తెలిసివస్తాయని ఆయన చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ వార్ గురించి ప్రస్తావించిన జైశంకర్.. ఈ రెండు దేశాలూ యుద్ధం విరమించి చర్చలకు కూచోవాలన్నారు. ఉక్రెయిన్ లోని పరిస్థితి పట్ల ఇండియా తీవ్ర ఆందోళన చెందుతోందని, ఇది యుద్ధ శకం కాదని ప్రధాని మోడీ ఇదివరకే వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఉభయ దేశాలూ చర్చల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకోవాలని తాము కోరుతున్నామన్నారు.
సుదీర్ఘ పోరు ఏ పక్షానికీ ప్రయోజనకరం కాదని ఆయన చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల నేతలతో తమ ప్రధాని కాంటాక్ట్ లో ఉన్నారని, వార్ విరమణ విషయంలో భారత ప్రభుత్వ వైఖరిని వారికి వివరిస్తున్నారని జైశంకర్ పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో ఆయన చైనా నుంచి ఇండియాకు తలెత్తుతున్న ముప్పు లేదా సరిహద్దుల్లో ఉద్రిక్తతల గురించి కూడా ప్రస్తావించి ఉండవలసిందని విశ్లేషకులు
భావిస్తున్నారు.