జమ్ము కశ్మీర్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తనిఖీలు నిర్వహిస్తోంది. అల్ హుదా ఎడ్యేకేషనల్ ట్రస్టు అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించి ఉగ్ర నిధుల కేసులో ఈ తనిఖీలు చేస్తున్నట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.
జమ్ము కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కలిసి ఉమ్మడిగా తనిఖీలు నిర్వహిస్తోంది. జమ్ము కశ్మీర్ లోని రాజౌరీ, పూంఛ్, జమ్ము, శ్రీనగర్, పుల్వామా, బుద్గామ్, షోపియాన్, బందీపుర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్టు ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి.
జమ్ము కశ్మీర్ లోని జమాతే ఇస్లామీ సంస్థకు అనుబంధ సంస్థగా పని చేస్తున్న అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిధులు, కార్యకలాపాలపై ఎన్ఐఏ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ మేరకు తనిఖీలు చేస్తున్నారు. జమాతే ఇస్లామీ జమ్మూ కశ్మీర్‌ను 2019లో ఉపా చట్టం కింద ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా ప్రకటించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ మత బోధకుడు, రెక్టార్ దారుల్ ఉలూమ్ రహీమియా, మౌలానా రెహమ్తుల్లా ఖాస్మీ, నిట్ శ్రీనగర్ ప్రొఫెసర్ సమమ్ అహ్మద్ లోన్ నివాసాలపై ఎన్ఐఏ దాడులు చేస్తోందని స్థానిక మీడియా పేర్కొంది.