ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు. పోటీ చేసిన అభ్యర్ధికి గెలుపు ఓటములు సహజం. అయితే.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిన ఓ వ్యక్తి హల్ చల్ సృష్టించాడు. ఓటమిని తట్టుకోలేక ఐదు గ్రామాలకు వెళ్లే రోడ్డును తవ్వి.. బండరాళ్లను అడ్డంగా పెట్టి రహదారిని దిగ్బంధించాడు. ఈ ఘటన ఒడిశా గజపతి జిల్లాలోని గంగాబాడ పంచాయతీలో గురువారం చోటుచేసుకుంది.
ఒడిశా లోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో గంగాబాడ గ్రామపంచాయతీ ఉంది. ఆ గ్రామంలో మొత్తం 1500 మంది ఓటర్లు ఉన్నారు. గంగబాడ పంచాయతీలో గత 15 సంవత్సరాలుగా హరిబంధు కర్జీ, అతని కుటుంబ సభ్యులే సర్పంచ్ గా ఎన్నికవుతున్నారు.
అయితే.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా బారిక్ షాబర్ అనే వ్యక్తిపై హరిబంధు కర్జీ యరో సారి ఘన విజయం సాధించి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఈ కోపంతోనే బారిక్ రహదారుల దిగ్బంధించడమే కాకుండా.. వీధి దీపాలను ధ్వంసం చేశారని కర్జీ ఆరోపించారు.
గ్రామస్తులతో కలిసి గారబంధ పోలీస్ స్టేషన్ లో బారిక్ పై ఫిర్యాదు చేశారు కర్జీ. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.