తెలంగాణలో బీజేపీ కార్యాలయం టార్గెట్ గా ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్రముప్పు పొంచి ఉందని తెలిపారు. కొత్త కొత్త వ్యక్తులు, పార్టీతో సంబంధంలేని వారు.. కార్యాలయానికి వస్తున్నారని బీజేపీ తెలంగాణ నేతలకు సమాచారం అందించాయి. పార్టీ ఆఫీస్‌కు వచ్చే వారిపై మానిటరింగ్ లేదని హెచ్చరించింది. పార్టీ కార్యక్రమాలు జరిపినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. పార్టీ కార్యాలయానికి కొన్ని రోజులు వెళ్లకపోవడం మంచిందని బీజేపీ ముఖ్యనేతలకు నిఘా వర్గాలు తెలిపాయి.
కాగా.. జరగనున్న గణతంత్ర వేడుకలను ముష్కరులు టార్గెట్ గా పెట్టుకున్నారని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ప్రధాని నరేంద్రమోదీ సహా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని భారీగా దాడులకు తెగబడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. పాకిస్థాన్, అఫ్గాన్-పాక్ ప్రాంతానికి చెందిన ముష్కరులు దాడులకు పాల్పడతారని తమకు సమాచారం ఉందని తెలిపాయి.
గణతంత్ర వేడుకలతో పాటు.. రద్దీగా ఉండే ప్రాంతాలు.. ప్రజా సమూహాలు, ప్రముఖ కట్టడాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు ముష్కరులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దాడులకు ఉగ్రవాదులు డ్రోన్లు, భారీ పేలుడు పదార్థాలు వాడే ప్రమాదం ఉందని కీలక సమాచారం.
లష్కరే తోయిబాతో పాటు ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలు పెద్ద ఎత్తున దాడులకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీతో పాటు పంజాబ్, ఇతర నగరాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగే ప్రమాదం ఉంది.