ఆప్ఘనిస్థాన్‌లో తాత్కాలికంగా తాలిబన్లు ప్రకటించిన కొత్త ప్రభుత్వం తీరు.. భారత్‌కు సవాల్‌గా మారేట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా తాజా ప్రభుత్వ కూర్పు వెనక పాకిస్థాన్ ముద్ర ఉందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. పాక్ కేంద్రంగా నడుస్తున్న హక్కానీ నెట్‌వర్క్ ఈ ప్రభుత్వ ఏర్పాటులో ప్రముఖ పాత్రను చేపట్టడంతో.. ఇకపై గతంలోలాగా ఆప్ఘనిస్థాన్, భారత్ మధ్య సత్సంబంధాలు సంబంధాలను కొనసాగించడం, ఆప్ఘాన్ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియను పూర్తి చేయడం భారతదేశానికి సవాలుగా ఉండవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పైగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించకూడదని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తుండటంతో.. ఢిల్లీ, కాబూల్ మధ్య ఇక దూరం పెరిగినట్టేనని విశ్లేషిస్తున్నారు.
ఆప్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో పాకిస్థాన్‌దే ప్రముఖ పాత్ర ఉందని అర్థమవుతుండటంతో.. ఇన్నాళ్లు ప్రధాని మోడీ అనుసరిస్తున్న ‘పొరుగుదేశాలకు ప్రాధాన్యత’ విధానానికి పెద్ద కుదుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భారత ప్రభుత్వం కాబూల్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని భావిస్తోంది. అలాగే కాందహార్, మజార్-ఇ-షరీఫ్, హెరాత్,జలాలాబాద్‌లోని కాన్సులేట్‌లను పూర్తిగా ఖాళీ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆదేశంతో ముఖాముఖి సంబంధాలు కొనసాగించడం అత్యంత సవాలుగా మారే అవకాశం ఉంది.
తాలిబాన్లు ప్రకటించిన తాత్కాలిక ప్రభుత్వంలో.. కొత్త క్యాబినెట్ మంత్రులంతా దాదాపుగా గతంలో తీవ్రవాద కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నవారే. వారందరిపైనా ఐక్యరాజ్యసమితి నిషేధం విధించింది. పైగా వీరిలో చాలా మంది FBI ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో ఉన్నారు.
తాత్కాలిక ప్రధాన మంత్రి మహ్మద్ హసన్ అఖుండ్.. తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌కు ప్రధాన సహాయకులలో ఒకరు. ఇయనపై ఏనాడో ఐక్యరాజ్య సమితి నిషేధం విధించింది. 2001లో బామియాన్‌లో బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేయించింది ఈయనే. ఇక ఇద్దరు ఉప ప్రధానులు.. అబ్దుల్ ఘనీ బరదార్ అబ్దుల్ సలాం హనాఫీ కూడా UN బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నారు. హక్కానీ నెట్‌వర్క్ నుంచి అత్యంత భయంకరమైన వ్యక్తులుగా పేరొందిన మరో ముగ్గురిని ప్రభుత్వంలో నియమించారు. మోడీ ప్రభుత్వానికి ఇది చాలా ఆందోళన కలిగించే విషయం.
దోహాలో తాలిబన్ల రాజకీయ కార్యాలయ అధిపతిగా ఉన్న అబ్దుల్ ఘనీ బరాదర్.. ఆప్ఘాన్‌లోని కొత్త ప్రభుత్వాన్ని నడిపిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ అధిపతి జనరల్ ఫైజ్ హమీద్ మూడు రోజులు కాబుల్‌లోనే ఉండి మొత్తం వ్యవహారానే మార్చేసాశారు. బరాదర్ స్థానంలో మహ్మద్ హసన్‌కు వచ్చి కూర్చుకుంటున్నారు. అంటే కొత్త తాలిబాన్ క్యాబినెట్ కూర్పు పాకిస్థాన్ ద్వారా ఎంతగా ప్రభావితమైందో స్పష్టంగా తెలియజేస్తోంది.
భారత్‌కు మాత్రమే.. ఆప్ఘాన్‌లోని కొత్త క్యాబినెట్ మొత్తం అంతర్జాతీయ సమాజానికే చెంపపెట్టులాంటిదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే వారిలో 17 మంది UN ఆంక్షల జాబితాలో ఉన్నారు. పక్కగా ఇది పాకిస్థాన్ కోసం పాకిస్థాన్ చేత.. పాకిస్థాన్ ద్వారా రూపొందించబడిన క్యాబినెట్ అని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆప్ఘనిస్థాన్ ఉగ్రవాదులకు అధికారిక కవాతుకు ఓ వేదిక అని అంటున్నారు.