పెద్దపెల్లి జిల్లా సింగరేణి ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మార్చురీ ముందు కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏఎల్‌పీ గనిలో మృతి చెందిన కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు కార్మికులు.
మార్చురీలో ఉన్న మృతదేహాన్ని తీసుకుని గని దగ్గరకు వెళ్లి ధర్నా చేయాలని ప్రయత్నించారు. అందుకోసం మార్చురీ తాళం పగులగొట్టేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మృతుడి బంధువులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఆడ్రియాల భూగర్భ గనిలో మార్చి 7న పైకప్పు కూలింది. ఆ సమయంలో గనిలో ఆరుగురు పని చేస్తున్నారు. వారిలో ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది కాపాడింది.
ఈ ఘటనలో అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, సేఫ్టీ మేనేజర్ జయరాజ్, ఒప్పంద కార్మికుడు శ్రీకాంత్ మృతి చెందారు.