ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఏం చేసిన సంచలనమే. సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఆయన.. కొకకోలా, మెక్‌డొనాల్డ్ వంటి ప్రముఖ సంస్థలను కొనుగోలు చేస్తున్నట్లు ట్వీట్ చేసి షాక్ ఇచ్చారు. ఈనేపథ్యంలో తాజాగా ఎలాన్ మస్క్ చేసిన ట్విట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
‘నేను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే.. మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం’ అని ఎలాన్ మస్క్ ట్విట్ చేశారు. అయితే, ఈ పోస్టుకు గంట ముందు.. ‘ఉక్రెయిన్‌లోకి ఫాసిస్ట్ దళాలతో పాటు కమ్యూనికేషన్ సామగ్రిని పంపించటంలో మీ భాగస్వామ్యం ఉంది. దీనికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది.’ అంటూ రష్యన్ అధికారి పంపిన సందేశాన్ని షేర్ చేశారు మస్క్.
ఈ సామాగ్రి ఉక్రెయిన్‌కు పెంటగాన్ పంపించినట్లు పేర్కొన్నారు రష్యన్ అధికారి. ఈ నేపథ్యంలో తాను అనుమాస్పదంగా చనిపోతే అని ట్వీట్ చేయడంతో ఇది పరోక్షంగా రష్యాను ఉద్దేశించే వ్యాఖ్యానించారా అన్న చర్చ నడుస్తోంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా తాను పుతిన్‌తో ఢీకొనడానికి రెడీ అని ఎలాన్ మస్క్ గతంలో ప్రకటించారు. ఈ విషయంలో మస్క్‌కు రష్యా నుంచి బెదిరింపులు వస్తున్నాయా..? అనే విషయంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌లో స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సేవలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. యుద్ధం జరుగుతున్న క్రమంలో శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సేవలు ప్రారంభించటంపై రష్యా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
If I die under mysterious circumstances, it’s been nice knowin ya
— Elon Musk (@elonmusk) May 9, 2022