అమరావతిపై ఎప్పుడైతే జగన్ సర్కార్ కమిటీ వేసిందో వెంటనే రాజధానిపై మరో రగడ మొదలయ్యింది. రాయలసీమకు అన్యాయం జరిగిందని, ఉత్తరాంధ్రకు మరీ అన్యాయం జరిగిందని భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ నేత టీజీ వెంకటేష్ సీమలో సెకండ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలంటున్నారు.
అనంతపురం : రాజధాని విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత టీజీ వెంకటేష్ అన్నారు. ‘అసలు చంద్రబాబు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రి అయినా రాయలసీమను ఆదుకోవాలని కోరారు. సీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని టీజీ కొత్త డిమాండ్ మొదలెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణ జరగాలని అన్నారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ఏర్పాటు చేయాలని జగన్‌కో సజెషన్ ఇచ్చారు. ఇలావుంటే, రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన టీజీ వెంకటేశ్.. అక్కడ రాయలసీమ ఉద్యమాన్ని బలపరిచేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ‘తిరుమల శ్రీవారి నిధులు తీసుకెళ్లి రాష్ట్రాభివృద్ధికి వెచ్చిస్తారు. మరి బెజవాడ కనక దుర్గమ్మ నిధులు, సింహాచలం దేవస్థానం నిధులు రాయలసీమ అభివృద్ధికి వినియోగిస్తారా? ఏమిటీ వివక్ష..’ అని టీజీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది.