పట్టణాల్లో మహిళలపై అఘాయిత్యాలు అరికట్టేందుకు షీటీమ్స్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. షీ టీమ్స్ సక్సెసా ఫెయిలా అన్న చర్చను పక్కన పెడితే… ఓ వ్యవస్థ అండగా ఉందన్న నమ్మకాన్ని మహిళల్లో కాస్తయిన కలిగించింది. కానీ జిల్లాల్లో, గ్రామాల్లో బయటకు రాకుండా ఉన్న వేధింపులు అన్నీ ఇన్నీ కావు. పట్టణాలతో పోలిస్తే రూరల్ ఏరియాల్లో మహిళల వేధింపులు ఇంకాస్త ఎక్కువే.
దిశ కేసుతో పోలీసులపై మహిళా సంఘాలు ఎంతలా మండిపడ్డాయో, ప్రభుత్వాన్ని ఎంతలా తిట్టిపోశాయో అందరికీ తెలిసిందే. ఎన్‌కౌంటర్ తర్వాత కాస్త శాంతించినా… శాశ్వత పరిష్కారం కోసం పట్టుబడుతున్న సందర్భంలో… గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు రక్షణగా షీటీమ్స్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ షీ టీమ్స్‌లో డ్వాక్రా మహిళలు ఉండబోతున్నారు. షీ టీమ్స్‌లో పనిచేసే డ్వాక్రా మహిళలు పోలీసులతో కో ఆర్డినేట్ చేసుకునే విధంగా పంచాయితీ రాజ్ డిపార్ట్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి గ్రామంలో డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నందున… వారినే షీ టీమ్స్‌గా ఉపయోగించుకుంటే గ్రామాల్లో మహిళా వేధింపులు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశమున్నా, మాటలు కోటలు దాటించి… చేతలు గడప కూడా దాటించని అలవాటుందని విమర్శలు ఎదుర్కొనే తెలంగాణ ప్రభుత్వం, తాజా నిర్ణయాన్ని ఎలా అమలు పరుస్తుందో చూడాలి.