కాంగ్రెస్,బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణ పై ఫోకస్ పెంచారు. వరుస పర్యటనలతో పార్టీ శ్రేణులను చైతన్యవంతులను చేయడం మొదలు పెట్టారు. బీజేపీ బిగ్ బాసులు తెలంగాణలో ఎలాగైనా జెండా పాతాలని పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ కూడా స్పీడ్ పెంచుతోంది. ఈక్రమంలోనే నేటి నుంచి మూడు రోజుల పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే తెలంగాణలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు వ్యక్తిగత, సామూహిక సమావేశాలు నిర్వహించనున్నారు.
టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు,ఎంపీలకు,ఎమ్మెల్సీలకు,సీనియర్ నాయకులకు టీపీసీసీ కార్యాలయం నుంచి ఫోన్ చేసి సమావేశాలలో పాల్గొనాలని నాయకులు కోరారు. రేపటి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,ఎంపీలు ఉత్తమ్,కోమటి రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. థాక్రే తెలంగాణకు రావడం ఇది రెండోసారి.
మొదటి సారి హైదరాబాద్ లో అడుగుపెట్టిన థాక్రే తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో వరుస భేటీ అయ్యారు. జనవరి 12 న రెండు రోజుల పర్యటన నిమిత్తం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన థాక్రే గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో వరుసగా భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పని చేద్దామని నేతలకు థాక్రే సూచించారు.
ప్రతి పబ్లిక్ ఇష్యూలను వదలకుండా పోరాటం చేయాలని నేతలకు ఆయన చెప్పారు. సర్కార్ వ్యతిరేకతను పార్టీకి కలిసొచ్చేలా వ్యూహరచన చేయాలని నేతలకు సూచించిన ఆయన ఈగోలతో కాకుండా ఇష్టంతో పనిచేయాలని సూచించారు. దీంతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు ప్రతీ ఒక్కరూ ఏఐసీసీ గైడ్ లైన్స్ ప్రకారం రెండు నెలల పాటు పాదయాత్ర చేయాలని థాక్రే సూచించారు.