– నియోజకవర్గాల పర్యటనలో థాక్రే
– అభ్యర్థుల లిస్టుపై నివేదిక
– త్వరలో హస్తిన పెద్దల ముందుకు!
– గాంధీ భవన్ లో హాట్ హాట్ చర్చ
ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే సీక్రెట్ ఆపరేషన్ టీ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ ను క్రియేట్ చేస్తోంది. ఆయన రహస్యంగా తయారు చేస్తున్న నివేదికతో జిల్లాల ఇంఛార్జీలు, కీలక లీడర్ల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అంతే కాదు థాక్రే మాత్రమే రహస్యంగా వివిధ నియోజకవర్గాల ముఖ్య నేతలతో భేటీ కావడం కాంగ్రెస్ వర్గాల్లో కలవరాన్ని కల్గిస్తోంది.
ఇంతకీ థాక్రే సీక్రెట్ ఆపరేషన్ ఏంటీ..? అంతలా నేతలు ఆందోళన చెందాల్సిన విషయం ఏంటీ..? ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జీగా మాణిక్ రావు థాక్రే బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ఆయన వర్కింగ్ స్టైల్ ఎఫెక్ట్ స్పష్టంగా టీ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూనే ఉంది. అంత వరకూ అంతర్గకుమ్ములాటలతో రచ్చ రచ్చ చేసిన టీ కాంగ్రెస్ వర్గాలు.. గప్ చుప్ కాక తప్పలేదు.
అయిష్టంగానే ఎందుకు కాదు.. క్రమశిక్షణకు, పార్టీ నిర్ణయాలకు లోబడి ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైఫు హత్ సే హత్ జోడో యాత్రతో పార్టీకి కాస్త జీవం వచ్చినట్లైంది. పార్టీలోని కొందరు కీలక నేతలు టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో కలిసి ఈ యాత్రలో అడుగులు వేస్తుండడంతో..క్యాడర్ లో ఊపు పెరిగింది.దీంతో అంతర్గత పోరుతో సతమతమవుతున్న టీ కాంగ్రెస్ ని గాడిలో పెట్టిన క్రెడిట్ ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేకు పోతుంది.
ఇక ఇలా ఉంటే..ఆయన తెలంగాణలోని వివిధ నియోజక వర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే నల్గొండ, ములుగు, హైదరాబాద్ లోని పలు నియోజక వర్గాల్లో పర్యటించారు. అయితే ఆయన ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ నివేదిక తయారు చేస్తున్నారు. ఈ రిపోర్టును ఢిల్లీకి పంపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైంది.
థాక్రే ఢిల్లీకి పంపించే రిపోర్టులో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉన్నాయంటూ గాంధీ భవన్ లో హాట్ హాట్ గా చర్చ కొనసాగుతోంది. దీంతో ఆ నివేదికలో ఎవరి పేర్లు ఉన్నాయోనని ఇంఛార్జీలు, కీలక లీడర్లు ఉత్కంఠతో ఉండడం గమనార్హం. అయితే థాక్రే మాత్రం రహస్యంగా వివిధ నియోజకవర్గాల ముఖ్య నేతలతో భేటీ కావడం కాంగ్రెస్ వర్గాల్లో కలవరం కలిగిస్తోంది.