-కాస్త గాడిలో పడ్డ టీ కాంగ్రెస్
-పనికొచ్చిన థాక్రే స్పెషల్ ఫార్ములా
-50 నియోజక వర్గాల్లో రేవంత్ పాదయాత్ర
-30 నియోజక వర్గాల్లో సీనియర్లకు ఛాన్స్
-ఫిబ్రవరి 6 లోగా కొత్త డీసీసీలకు బాధ్యతలు
-పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే చర్యలు తప్పవన్న రేవంత్
తలోదారి అన్నట్టు సీనియర్లు ఓవైపు.. జూనియర్లు ఓ వైపు.. రేవంత్ రెడ్డి బ్యాచ్ ఓ వైపు.. ఉత్తమ్ బ్యాచ్ మరో వైపు.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిది సపరేటు రూటు.. ఇది నిన్నటి వరకు టి కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో బజారున పడ్డ దుస్థితి. మరి ఇప్పుడు కొత్త ఇంచార్జ్ బాస్ వచ్చిన తరువాత మాత్రం అందరూ ఏకతాటి పైకి నెమ్మదిగా వస్తున్నారు. అదెలా..ఇంత సడెన్ గా థాక్రే కు ఎలా సాధ్యపడింది..మాణిక్ రావు థాక్రే వేసిన మంత్రం ఏంటీ..?
అధికారంలోకి రావడానికి అధికార పార్టీ పై పోరాడాలి కాని తమలో తాము పోరాడుకోవద్దని గట్టిగా బుద్ధి పెట్టిన మాణిక్ రావు థాక్రే.. ఓ నెంబర్ వన్ ఫార్ములాను సెట్ చేశారు. దీంతో ఎక్కడి వారు అక్కడే గప్ చుప్ అన్నట్టుగా ఈగోలను పక్కన పెట్టి.. పక్కన పక్కన కూర్చోక తప్పలేదు. ఆ ఫార్ములా ఏంటంటే.. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయవద్దని సీనియర్ల ప్రధాన డిమాండ్ ఉండే. తాము కూడా చేస్తామని వాళ్లంతా ముందు నుంచి పట్టుబట్టారు.
దీంతో థాక్రే.. రేవంత్ రెడ్డికి యాభ్భై నియోజక వర్గాల్లో పాదయాత్ర చేసే అవకాశమిచ్చి..మిగతా సీనియర్లు ఇరవై నుంచి 30 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసుకోవచ్చని ఛాయిస్ ఇచ్చారు. దీంతో దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా.. రేవంత్ బ్యాచ్ తో పాటు సీనియర్ల బ్యాచ్ కూడా థాక్రే మాటలకు ఓకే చెప్పాల్సి వచ్చింది. తమకూ పాదయాత్ర అనుమతి దొరికిందని సీనియర్లు కాలర్ ఎగరేసుకుంటున్నారు. దీంతో గొడవ సర్ధుమణిగింది. నేతలందర్ని ఏకతాటి పైకి తీసుకొచ్చే గురుతర బాధ్యతను భుజాలపై వేసుకున్న థాక్రే కృషి ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. మరో వైపు తాను అనుకూలం కాదు..ఎవరికి వ్యతిరేకం కాదని థాక్రే పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
దీంతో రేవంత్ రెడ్డికి మరింత ధైర్యం వచ్చినట్లయింది. ఆయన కొత్త డీసీసీ అధ్యక్షుల్ని నియమించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 6 లోగా కొత్త డీసీసీలు బాధ్యతలు తీసుకుంటారు. బాధ్యతగా పనిచేయనివారిని తప్పించి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఇక ఎవరైనా బహిరంగంగా మాట్లాడొచ్చు..కానీ పార్టీకి నష్టం కలిగించేలా ఉండకూడదని థాక్రే సూచించారు. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే చర్యలు తప్పవని రేవంత్ హెచ్చరించారు.ఈ నెల 26 నుంచి రెండు నెలల పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర జరుగుతుంది.
తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆరాటమే కాని ..ఎవరికీ సొంత నియోజకవర్గంలో కూడా జన సమీకరణ చేసుకునేంత క్రేజ్ లేదు. రేవంత్ రెడ్డికి మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అయినా రేవంత్ వెనుక నడవకుండా..తాము సీనియర్లమని..తమను పట్టించుకోవడం లేదని.. వారు పార్టీని ఆగం పట్టించుకున్నారు. వచ్చిన ఇంచార్జులందర్నీ తరిమేశారు. మరి ఈ సారి థాక్రే ఇచ్చిన ఫార్ములాకు కట్టుబడి ఉంటే రానున్న ఎన్నికల్లో కాస్తైనా.. పార్టీ పరువు నిలుస్తుంది.