అల వైకుంఠపురములో.. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్. టాలీవుడ్ బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటిగా నిలిచిపోతాయి. ఇలాంటి చార్ట్ బస్టర్ ఆల్బమ్ వెనక ఉన్నది ఇద్దరే ఇద్దరు వ్యక్తులు. వాళ్లే దర్శకుడు త్రివిక్రమ్, మ్యూజిక్ డైరక్టర్ తమన్. లాంగ్ గ్యాప్ తర్వాత వీళ్లిద్దరూ మరోసారి కలిశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ చేశారు.
త్వరలోనే మహేష్ బాబుతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు త్రివిక్రమ్. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు తమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అలా త్రివిక్రమ్-తమన్ మరోసారి కలిశారు. అల వైకుంఠపురములో సినిమా మేజిక్ ను మహేష్ బాబు కోసం రిపీట్ చేయాలనుకుంటున్నారు.
లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలవలేదు. ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలొచ్చాయనే టాక్ కూడా ఉంది. ఎప్పుడైతే అల వైకుంఠపురములో సినిమా పెద్ద హిట్టయిందో, అప్పుడు నమ్రత రంగంలోకి దిగి, ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చిందని సమాచారం.
సో.. ఈ సినిమాను త్రివిక్రమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దీని కోసం ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాను కూడా పక్కనపెట్టాడు. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంగీతం అందించే బాధ్యత తీసుకున్నాడు తమన్. ‘అల’ మేజిక్ రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలి.