తమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య పోటీ గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా వీళ్ల మధ్య సంక్రాంతి పోటీ రంజుగా ఉంటుంది. ఆ మధ్య ఓ సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో తమన్, దేవిశ్రీపై పైచేయి సాధించాడు. ఇప్పుడు అలాంటి పోటీ మరోసారి వీళ్ల మధ్య మొదలైంది.
ఈ సంక్రాంతికి చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలయ్య చేస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు బరిలో నిలిచాయి. వీటిలో వాల్తేరు వీరయ్య సినిమాకు దేవిశ్రీప్రసాద్, వీరసింహారెడ్డి సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. తెరపై చిరు-బాలయ్య మధ్య పోటీ కనిపిస్తే, తెరవెనక తమన్-దేవిశ్రీ మధ్య పోటీ అన్నమాట.
అయితే వీళ్లిద్దరి మధ్య పోటీలో పైచేయి ఎవరిదనే అంశం తేల్చడానికి సంక్రాంతి వరకు ఆగాల్సిన పనిలేదు. ఈ సినిమాల నుంచి సింగిల్స్ రిలీజ్ చేస్తున్నారు. ముందుగా వాల్తేరు వీరయ్య నుంచి బాస్ పార్టీ సాంగ్ వచ్చేసింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి సినిమా నుంచి జై బాలయ్య సాంగ్ కూడా వచ్చేసింది.
ఇలా రెండు సినిమాల నుంచి ఫస్ట్ సింగిల్స్ వచ్చేశాయి. ప్రస్తుతానికైతే ఈ రెండు పాటల్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే దేవిశ్రీ ప్రసాద్ దే పైచేయిగా నిలిచింది. వీళ్లిద్దరిలో పూర్తి ఆధిపత్యం ఎవరిదనేది సంక్రాంతి నాటికి తేలిపోతుంది. అప్పటివరకు ఈ పాటల పోటీ అలా కొనసాగుతూనే ఉంటుంది.