టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ భావోద్వేగ లేఖ రాశాడు. దీనికి సంబంధించిన ప్రతిని ట్విట్టర్, ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
ఓ టాలెంటెడ్ బ్యాట్స్ మన్ నుంచి ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ గా ఎదిగే వరకు కోహ్లీ ప్రయాణాన్ని అందులో యువీ గుర్తు చేసుకున్నాడు. దీంతో పాటు ఆయనకు బంగారు బూట్లను బహుమతిగా అందజేశాడు.
‘ కోహ్లీ ఓ ఆటగాడిగా, వ్యక్తిగా ఎదగడం నేను దగ్గర నుంచి గమనించాను. ఒకప్పుడు దిగ్గజాలతో కలిసి తిరిగిన అతను ఇప్పుడు ఓ లెజెండరీ క్రికెటర్ గా ఎదిగారు. ఆయన చూపిన అంకిత భావం, క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న అభిరుచి, ఆయన ఆట తీరు చూసి ప్రతి పిల్లవాడికి ఏదో ఒక రోజు టీమ్ ఇండియా జట్టులో చేరాలనేలా ప్రేరేపిస్తుంది” అని అన్నారు.
దీనిపై విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘ ఈ అద్భుతమైన బహుమానానికి యువీ పా ధన్యవాదాలు. మొదటి రోజు నుండి నా కెరీర్‌ని చూసిన వ్యక్తి నుండి ఈ బహుమానం రావడం ఆనందంగా ఉంది. మీ జీవితం, క్యాన్సర్ నుండి మీ పునరాగమనం క్రికెట్‌లోనే కాకుండా అన్ని రంగాలలోని వారికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది’ అని కోహ్లీ తన పోస్ట్‌లో రాశాడు.