ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ దక్కడం పై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మూవీ టీమ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా థ్యాంక్యూ మావయ్య అంటూ రిప్లై ఇచ్చారు.
నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అందడం పట్ల యావత్ సినీ ప్రపంచం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం అభినందనలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికవ్వడం ఆనందంగా ఉందంటూ సంగీత దర్శకుడు కీరవాణి,దర్శకుడు రాజమౌళిని అభినందించారు.
తనకు చాలా గర్వంగా ఉందన్నారు. తాను ముందే చెప్పినట్టు ప్రపంచ భాషల్లో తెలుగు భాష సత్తా చాటిందన్నారు. అయితే చంద్రబాబు ట్వీట్ కు ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. థాంక్యూ సో మచ్ మావయ్య అంటూ రిప్లై ఇచ్చారు. చంద్రబాబు ట్వీట్ కు జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం పై అభిమానులు ఆనందంతో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరో వైపు కీరవాణి కూడా థ్యాంక్యూ వెరీ మచ్ సార్ అని చంద్రబాబు ట్వీట్ కు బదులిచ్చారు.
ఇక ప్రధాని కూడా ఇదొక విశేషమైన విజయం..కీరవాణి,ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, చంద్రబోస్ తో పాటు రాజమౌళి,రామ్ చరణ్, ఇతర చిత్ర బృందానికి నా అభినందనలు. ఈ ప్రతిష్టాత్మక విజయంతో ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేశారు అని అభినందించగా..దానికి జూనియర్ ఎన్టీఆర్ థాంక్యూ సార్ అని బదులిచ్చారు.