ఈ నెల 28 న నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయంపై ప్రధాని మోడీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో తన పర్యటనను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. సిడ్నీలోని ప్రవాస భారతీయులు నిర్వహించిన కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో బాటు మాజీ ప్రధాని, ఎంపీలు, విపక్షాలకు చెందిన అనేకమంది నేతలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యమంటే అదీ అని వ్యాఖ్యానించిన ఆయన.. ఇక్కడ ఇండియాలో విపక్షాలు మాత్రం ఇలా వ్యవహరిస్తున్నాయని పరోక్షంగా విమర్శించారు.
జపాన్, పపువా న్యూగినియా, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించి నిన్న ఢిల్లీ చేరుకున్న మోడీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రులు,బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు అపూర్వ రీతిలో వెల్కమ్ చెప్పారు. మోడీ..మోడీ అన్న నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. తన విదేశీ పర్యటనలో ప్రపంచానికి భారత దేశ విశిష్టతను చాటి చెప్పానని, తను మాట్లాడుతున్నప్పుడు వాల్డ్… 140 కోట్లమంది భారతీయుల ప్రతినిధిగా మాట్లాడుతున్నట్టు విశ్వసించిందని మోడీ చెప్పారు.
జీ-20 అధ్యక్ష హోదాలో ఇండియా చేపడుతున్న కార్యక్రమాలను ప్రపంచ దేశాల నేతలు ప్రశంసించారని ఆయన తెలిపారు. నేను కలిసిన నాయకులంతా ఈ విషయంలో భారత ప్రభుత్వ కృషిని అభినందించారని, ఇది భారతీయులందరికీ గర్వ కారణమని ఆయన అన్నారు.
మొదట జపాన్ లోని హిరోషిమాలో జీ-7 కూటమి సమ్మిట్ కి హాజరైన మోడీ.. ఆ తరువాత పపువా న్యూగినియా చేరుకొని అక్కడ 14 పసిఫిక్ ఐలాండ్ దేశాలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ దేశంలోనూ మోడీకి ఘన స్వాగతం లభించింది. సూర్యాస్తమయం తరువాత విదేశీ నేతలకు తమ దేశంలో అపూర్వ స్వాగతం పలకరాదన్న తమ సంప్రదాయాన్ని పక్కన బెట్టిన ప్రభుత్వం ఆయనను సాదరంగా స్వాగతించింది. ఆ తరువాత ఆస్ట్రేలియా వెళ్లి ఆ దేశ ప్రధాని అల్బనీస్ తో కలిసిన మోడీ వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు.. ‘మోడీ ఈజ్ బాస్’ అని అల్బనీస్ ఆయనను అభివర్ణించారు.