మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ ప్లాజా సిబ్బంది పై బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య దాడికి దిగారు. అయితే టోల్ ప్లాజా సిబ్బంది ప్రోటోకాల్ పాటించకుండా దురుసుగా వ్యవహరించడమే ఈ దాడికి కారణంగా ఆయన సమర్థించుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. గత నెలలోనే మంద్రమర్రి టోల్ ప్లాజా ప్రారంభమైంది. అప్పటి నుంచి టోల్ ప్లాజా వద్ద వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే వాహనం అక్కడకు చేరుకోగానే టోల్ ప్లాజా సిబ్బంది ప్రోటోకాల్ పాటించలేదు. ఆయన కారుకు రూట్ క్లియర్ చేయలేదు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కారు దిగి.. రహదారి పనులు అసంపూర్తిగా ఉండగానే ప్రజల నుంచి టోల్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారంటూ సిబ్బంది పై దాడికి దిగారు.
ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. టోల్ ప్లాజా సిబ్బందే తన పట్ల దురుసుగా ప్రవర్తించారని స్పష్టం చేశారు. ఇక గతంలోనూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి పోస్టులు పెడితే సీరియస్ గా ఉంటుందని హెచ్చరించిన ఆయన.. ఇంకోసారి పోస్టు పెడితే నీ సంగతి చెబుతానంటూ సీరియస్ గా హెచ్చరించారు. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన స్వామి అనే వ్యక్తికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు.. ఇప్పుడా ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అంతకు ముందు కూడా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చాలా ఆరోపణలున్నాయి. బెల్లంపల్లి మున్నిపల్ ఛైర్ పర్సన్ పై అవిశ్వాసం సందర్భంగా కౌన్సిలర్ కొప్పుల సత్యవతి కూతురుకు ఫోన్ చేసి బెదిరించడం అప్పటల్లో సంచలనం సృష్టించింది. ఆయన ఓ భూవివాదంలో తలదూర్చినట్టుగా కూడా ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు మరోసారి టోల్ ప్లాజా సిబ్బంది పై దాడి సంచలనంగా మారడంతో ఎమ్మెల్యే పై పలువురు విమర్శలు చేస్తున్నారు.