హైదరాబాద్ మహానగరంలోని ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు మరింత వేగవంతమయ్యాయి. ఇటీవలే ఈ పనులు తనిఖీ చేసిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పనుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో జీహెచ్ఎంసీ పనులను వేగవంతం చేసి, మంత్రి విధించిన గడువు మే నెలాఖరుకల్లా సిద్ధం చేసేందుకు ప్లాన్ చేస్తుంది.
ఇందులో భాగంగా మంత్రి ఆదేశాల మేరకు నగర పోలీసులను సమన్వయం చేసుకుంటుంది. పనులు మరింత వేగంగా జరిగేందుకు వీలుగా ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు మూడు నెలల పాటు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలను అమలు చేయనున్నారు. ఈ ఆంక్షలు మార్చి 10 నుంచి జూన్ 10 వరకు అమలులో ఉంటాయని తెలిపారు.
ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. అయితే చిక్కడపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు వెళ్లే వాహనదారులు సుధా నందిని హోటల్ లేన్ వద్ద లెఫ్ట్ తీసుకొని సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్ట్రీట్ నెంబర్ 9 మీదుగా అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు, అక్కడి నుంచి ఇందిరాపార్కు చేరుకోవాలి.