అకాల వర్షాలతో నిండా మునిగిన అన్నదాతలకు ఎకరాకు పది వేలు ఏ మూలకు సరిపోతాయని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతులను కలిసి వారి సమస్యలను, కష్టాలను తెలుసుకున్నామన్నారు. తెలంగాణ సర్కార్ రైతాంగం పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోందన్నారు.
ఇంత వరకు రైతులకు రుణ మాఫీ చేయలేదని, 50 వేలు మాత్రమే రైతులకు రుణ మాఫీ అయిందని మండిపడ్డారు ఆయన. కొన్ని చోట్ల 25 వేలు మాత్రమే మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట వడగళ్ల వానతో కొట్టుకుపోతే.. రాష్ట్రం ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని కోమటి రెడ్డి అన్నారు.
అదే విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు భువనగిరిలో 4 వేల దరఖాస్తులుంటే, 2300 దరఖాస్తులు అనర్హులుగా తేల్చారని.. దానిలో అర్హులు లేరా.. అంటూ ఆయన నిలదీశారు. అదనంగా పేదలకు 200 ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరిలో 430 ఇళ్లు మాత్రమే ఉన్నాయని, ఆలేరులో డబుల్ బెడ్ రూం ఇళ్లు నీటి మునిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేపర్ లీకేజీ పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన కోమటి రెడ్డి.. ఇది 30 లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించిందని మండిపడ్డారు. ముందుగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఈ విషయంపై అమిత్ షాను కలుస్తానని అన్నారు ఆయన. రాహుల్ గాంధీ పై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై యావత్ దేశం ఆశ్చర్యం వ్యక్తం చేసిందన్నారు. ప్రజలందరూ రాహుల్ గాంధీకి తోడుగా నిలవాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.