టీ-20 ఫార్మాట్ వచ్చాక వన్డేలు, టెస్టులు తగ్గిపోయాయి. మరీ ముఖ్యంగా టెస్టులు కనుమరుగవుతాయనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే.. మరో సరికొత్త ఫార్మాట్ ఒకటి కరేబియన్ గడ్డపై ప్రారంభం కాబోతోంది. మరి.. దీని తర్వాత క్రికెట్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయా? అనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది.
కరేబియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ ఈ ఆగస్ట్ చివరిలో ప్రారంభం కానుంది. ఇది టీ-20 లీగ్. కానీ.. అంతకంటే ముందు ‘ది 6ixty’ పేరుతో టీ-10 లీగ్ ను సీపీఎల్ లో పరిచయం చేస్తున్నారు. ఇందులో రూల్స్ అన్నీ కాస్త సిల్లీగా.. ఇది కూడా క్రికెటేనా అనేలా ఉన్నా.. మ్యాచ్ ని మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు నిర్వాహకులు.
ఆగస్ట్ 24 నుంచి ఆగస్ట్ 28 వరకు సెయింట్ కిట్స్ లో ఈ టీ-10 మ్యాచ్ లు జరుగనున్నాయి. తొలిసారి వెస్టిండీస్ బోర్డు ఈ లీగ్ ను ప్రారంభిస్తోంది. ఇలాంటివి పలు దేశాల్లో లోకల్ గా జరుగుతున్నా అనేక కొత్త రూల్స్ తో సీపీఎల్ నిర్వాహకులు దీనికి రూపకల్పన చేశారు.
టీ-10 లీగ్ రూల్స్ ఇవే!
– ఒక్కో జట్టుకు 6 వికెట్లే ఉంటాయి
– 10 ఓవర్ల మ్యాచ్ మాత్రమే
– ఫీల్డింగ్ మాత్రం 11 మంది చేస్తారు
– మొదటి రెండు ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది
– తొలి రెండు పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసే జట్టు కనీసం రెండు సిక్సర్లు కొట్టగలిగితే ఫ్లోటింగ్ థర్డ్ పవర్ ప్లే అన్ లాక్ చేస్తారు. అంటే మూడో ఓవర్ కూడా పవర్ ప్లే కొనసాగుతుందన్నమాట.
– బౌలింగ్ జట్టు ప్రతి ఓవర్ తర్వాత ఎండ్ లు మార్చుకోవడంలో కూడా సడలింపులున్నాయి. ఒకే ఎండ్ నుండి వరుసగా ఐదు ఓవర్ల పాటు బౌలింగ్ చేసేందుకు వీలుంది.
– ఒక్కో టీమ్ కు 45 నిమిషాల నిర్ణీత సమయాన్ని కేటాయించారు
– పది ఓవర్లు 45 నిమిషయాల్లో పూర్తి చేయాలి. లేకపోతే ఇన్నింగ్స్ లోని చివరి ఆరు బంతులకు గ్రౌండ్ లో ఒక్కో ఫీల్డర్ ను తొలగించాల్సి ఉంటుంది.
– ఇంకో ఇంట్రస్టింగ్ రూల్ ఏంటంటే.. మిస్టరీ ఫ్రీ హిట్. ఫ్యాన్స్ ఓటు ద్వారా ఏ ఓవర్ ఏ బంతికి ఫ్రీ హిట్ కావాలనుకుంటున్నారో ఆ బంతికి అంపైర్ ఇస్తాడు. నోబాల్ తో సంబంధం ఉండదు.