స్విస్ బ్యాంకుల్లో భారతీయుల బ్లాక్మనీ భారీగా పెరిగింది. నల్లధనాన్ని స్వదేశానికి తెస్తానన్న ప్రధాని మాట అటుంచితే.. అదే స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం ఒక్క ఏడాదే 50శాతం పెరిగింది. ప్రస్తుతం స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు.. 30వేల కోట్ల రూపాయలకు పైమాటేనని లెక్కతేలింది. అందుకు సంబంధించి స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గణాంకాలతో ఈ విషయం రుజువైంది.
స్విస్ బ్యాంక్ వెల్లడించిన లెక్కలు చూసి భారతదేశమే కాదు.. యావత్ ప్రపంచం అవాక్కయింది. స్విస్ బ్యాంకుల్లోకి భారతీయుల సొమ్ము గతంలో కంటే వేగంగా తరలిపోతోందని నిపుణులు చెప్తున్నారు. భారతదేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు స్విస్ బ్యాంకుల్లో ఉంచిన డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇతర పత్రాల విలువ భారీగానే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
2021లో 30,500 కోట్లకు చేరినట్టు స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మొత్తం 14 ఏండ్ల గరిష్టంగా రికార్డులు చెప్తున్నాయి. అయితే.. స్విట్జర్లాండ్ బ్యాంక్లు ఎస్ఎన్బీకి అందించిన అధికారిక గణాంకాల ప్రకారం మాత్రమే 30,500 కోట్ల సొమ్ము భారతీయుల ఖాతాల్లో ఉన్నట్టు రికార్డులు చెప్తున్నాయి.
కానీ.. ఆ దేశంలో భారతీయులు భారీగా పోగేసిన నల్లధనంపై వివరాలు కాదంటున్నారు. థర్డ్ కంట్రీ సంస్థల పేర్లతో భారతీయులు, ఎన్నారైలు, ఇతరులకు ఉన్న సొమ్ము ఈ డాటాలో వెల్లడి కాలేదని అభిప్రాయపడుతున్నారు. ఇది తోడైతే ఆ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.