యూనిఫాం ఉద్యోగాలకు పెంచిన మూడేళ్ల వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు నిరుద్యోగ జేఏసీ నాయకులు. నోటిఫికేషన్ లు రాక చాలా మంది వయసు దాటిపోయిందని బాధలు పడుతున్నారని.. అందరికి అవకాశాలు దక్కేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ లో సహా.. గ్రూప్ 1 డీఎస్పీ ఎత్తు167.6 సెంటీమీటర్ల నుండి యూపీఎస్సీ నిబంధనలను అనుసరించి 165 సెంటీమీటర్లకి కుదించాలని అన్నారు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ లో డీఎస్పీ వయోపరిమితిని 28 సంవత్సరాల నుండి 32 సంవత్సరాలకి పెంచాలని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికి న్యాయం జరగాలంటే పెంచిన మూడేళ్ల వయో పరిమితిని.. ఐదేళ్లు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో ఓయూలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గడ్డం శ్రీనివాస్, ఓయూ జేఏసీ ఛైర్మన్ కొప్పుల ప్రతాపరెడ్డి, కార్తీక్, హరీష్ యాదవ్ లతోపాటు పలువురు నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.